Monday, 2 November 2015

ఆ నెంబరు చెబుతే మీ డబ్బు


  ఫోన్‌ చేసి హిందీలోనో, ఇంగ్లిషులోనే మాట్లాడతారు. బ్యాంకు ఖాతాకు లింక్‌ చేస్తున్నామని చెబుతారు. లేకపోతే మీ అకౌంట్‌ లావాదేవీలు నిలిచిపోతాయని చెబుతారు. మీ పేరు, వివరాలు చెబుతారు. నిజమైన బ్యాంకు అధికారులుగా నమ్మించి మీ డెబిట్‌ కార్డు మీద ఉన్న 16 అంకెల కోడ్‌ను రాబట్టుకుంటారు. ఆ తర్వాత మూడు అంకెల సీవీవీ (కార్డు వెరిఫికేషన్‌ వాల్యూ) నెంబరు అడుగుతారు. మీ ఫోన్‌కు ఓ కోడ్‌ నంబరు పంపుతామని చెబుతారు. ఫోన్‌ చేసి ఆ ఆరు అంకెల ఓటీపీ నెంబరు అడుగుతారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ఓటీపీ నెంబరును ఖాతాదారులు చెప్పేస్తున్నారు. ఎక్కడో దూరంగా ఉండి మన డెబిట్‌ కార్డు వివరాలతో ఇతరులు ఆన్‌లైన్‌లో పర్చేజ్‌ చేయకుండా సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన సిస్టమే ఓటీపీ నెంబరు. ఈ సెక్యూరిటీ నెంబరును కూడా ఖాతాదారులు చెప్పేయడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
నగరంలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థి సెల్‌కు ఫోన్‌ వచ్చింది. ఆమె ఫోన్‌ గ్రామంలో ఉండడంతో ఆ ఫోన్‌ ఎత్తిన కుటుంబ సభ్యులకు విషయం అర్థం కాలేదు. ఏదో బ్యాంకు నుంచి ఫోన్‌ వచ్చిందని గ్రహించారు. రిసీవ్‌ చేసుకున్న ఆ నెంబరును నగరంలో ఉన్న విద్యార్థికి ఫోన్‌లో చెప్పారు. హిందీ వచ్చిన తోటి విద్యార్థితో ఆ నెంబరుకు ఫోన్‌ చేయించింది. సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసిన యువతి అకౌంట్‌ వివరాలు సేకరించారు. ఖాతాలో ఉన్న రూ.4 వేలతో ఆన్‌లైన్‌ పర్చేజ్‌ చేశాడు. వెంటనే తన ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేశాడు. వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండేది. కానీ ఈ విషయం తెలియక ఫిర్యాదు చేయకపోవడంతో ఆ డబ్బును నష్టపోవాల్సివచ్చింది. నగరంలో జరగుతున్న నేరాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే.
10 నెలల వ్యవధిలో 5 వేల ఫిర్యాదులు
జంట కమిషనరేట్ల పరిధిలోని సైబర్‌ క్రైం స్టేషన్లకు ఈ 10 నెలల వ్యవధిలోనే 5 వేల ఫిర్యాదులు వచ్చాయి. నిత్యం బాధితులు అధిక సంఖ్యలో స్టేషన్‌కు వస్తుండడంతో పోలీసులు విస్తుపోతున్నారు. బాధితుల్లో 99 శాతం ఉన్నత విద్యావంతులే ఉంటున్నారు. ఫోన్‌కు ఓటీపీ నెంబరు మెసేజ్‌ వచ్చి నప్పుడు ఆ నెంబరు ఇతరులకు చెప్పవద్దని సూచిస్తూ (డోంట్‌ షేర్‌ యువర్‌ ఓటీపీ నెంబరు) అన్న మెసేజ్‌ ఉంటుంది. అయితే, ఈ నెంబరును ఆన్‌లైన్‌ మోసగాళ్లకు చెప్పేస్తుండడంతో దొంగకు తాళం ఇచ్చినట్లు ఉంది. ఇలా నగరంలో ఏడాదిలో ఇప్పటి వరకు రూ.5 కోట్ల నగదును ఆన్‌లైన్‌ మోసగాళ్లు దోచుకున్నట్లు అంచనా.
50 వేల సిమ్‌ కార్డులతో వల..
నిందితుల వద్ద 50 వేల సిమ్‌ కార్డులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒక్కో సిమ్‌ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురిని మోసం చేసి ఆ సిమ్‌ను నాశనం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎక్కువగా బిహార్‌, జార్ఖండ్‌, హర్యానా, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్‌ కేంద్రంగా మోసగాళ్లు ఖాతాదారులపై వల విసురుతున్నారు. బాధితుల్లో మొదటి స్థానంలో ఎస్‌బీఐ ఖాతాదారులు, రెండో స్థానంలో ఎస్‌బీహెచ్‌ ఖాతాదారులు ఉంటున్నారు. ఈ రెండు బ్యాంకు ఖాతాదారులు వివరాలు మోసగాళ్ల చేతికి చిక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని బ్యాంకులు తమ బ్యాంకు లావాదేవీలను ఆడిట్‌ చేసే పనిని అవుట్‌సోర్సింగ్‌కి ఇస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో బ్యాంకు ఖాతాదారులు వివరాలు బయటికి వెళ్లడం గాని, బ్యాంకుల వెబ్‌సైట్లు హ్యాకింగ్‌ జరిగిఉండవచ్చని సైబర్‌ పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఆధారాలు లేకుండా...
మోసగాళ్లు ఎస్‌బీఐ బుడ్డీ, పేయూ వంటి ఆన్‌లైన్‌ ఖాతాలకు డబ్బు మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి మొబైల్‌ రీచార్జిలతో పాటు ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరుపుతున్నారు. వారు కొనుగోళ్లు జరిపినప్పుడు ఖాతాదారుని సెల్‌ఫోన్‌కి పీవోఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌) నెంబరు, లావాదేవీల ఐడీ, నేమ్‌ ఆఫ్‌ ది ఆన్‌లైన్‌ మర్చంట్‌ వివరాలతో మెసేజ్‌ వస్తుంది. ఆన్‌లైన్‌ కొనుగోలుకు ఇదే కచ్చితమైన ఆధారమవుతోంది. ఈ ఆధారం కూడా లేకుండా చేయడానికి మోసగాళ్లు ఖాతాదారునికి ఫోన్‌ చేసి ఈ మెసేజ్‌ని డీలీట్‌ చేయిస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే కీలకమైన ఈ ఆధారం కూడా ఖాతాదారుల వద్ద ఉండడం లేదు. మోసం జరిగిందని గుర్తించి మెసేజ్‌ సమాచారం కోసం బ్యాంకుకు వెళ్లినా అప్పటికే సమయం మించి పోతోంది. దీంతో మోసపోయిన నగదులో నయాపైసా కూడా ఖాతాదారులకు తిరిగి రావడం లేదు.

No comments:

Post a Comment